
పల్నాడు జిల్లా పరిధిలో అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ను ఆయన కలిసి, పల్నాడు ప్రాంతంలో అనాదిగా కునారిల్లుతున్న రైల్వే సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. వెనకబడిన పల్నాడులో ప్రజా రవాణా మెరుగుపడితేనే.., ప్రాంతాల అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని ఆయన జీఎంకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే జీఎంకు ఎంపీ లావు అందించిన వినతి పత్రంలో కోరిన ప్రధాన పరిష్కార సమస్యలు ఇలా ఉన్నాయి…
- పెదకూరపాడులోని ఎల్ సి నెం.27, సత్తెనపల్లిలోని ఎల్ సి నెం.40, పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు వద్ద ఎల్ సి నెం. 81 వద్ద మంజూరైన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబి) నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి, ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించాలని కోరారు.
- బెల్లంకొండలోని ఎల్ సి నెం.53 వద్ద ఆర్ఓబి ని మంజూరు చేయాలని కోరారు.
- గిరిజవోలు మరియు మేరికపూడి గ్రామాల మధ్య ఉన్న ఎల్ సి నెం.గేట్ 294 ను ప్రస్తుత స్థానం నుండి 150 మీటర్లు ప్రక్కకు తరలించాలని అభ్యర్థించారు.
- మాచర్ల రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఫుట్‌పాత్ నిర్మాణం చేయాలని, కాలువ నిర్మాణం, ఆర్అండ్ బి రోడ్ నుండి మాచర్ల రైల్వే స్టేషన్ వరకు దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించాలని కోరారు.
- గురజాల, రెంటచింతల రైల్వే స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలు, మాచెర్ల-విజయవాడ మెము రైల్ (నెం.67228)కు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.
- పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వద్ద రైలు నెం.12795/12796 (ఎంప్లాయీస్ రైలు) మరియు రైలు నం.17221/17222 ఎల్ టి టి ఎక్స్‌ప్రెస్, భవనగర్ ఎక్స్ ప్రెస్ (రైల్ నెం.12755/12756) లకు స్టాపేజ్ ఇవ్వాలని..
- పెదకూరపాడు రైల్వే స్టేషన్ లో పల్నాడు ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 12747/12748) కు, డెల్టా ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.17645/17646)కు స్టాపేజ్ ఇవ్వాలని..
- పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు భద్రత సౌకర్యాలు పటిష్టం చేయాలని కోరారు.
- పెరేచర్ల రైల్వే స్టేషన్‌లో రైలు.నెం 17254 ఔరంగాబాద్ – గుంటూరు రైల్ ను ఆపాలని అభ్యర్థించారు.
- గుంటూరు – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.12705/76) పేరును అనవేమ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చడం విషయంపై అభ్యర్థించారు.

దీనిపై స్సందించిన జీఎం పల్నాడు జిల్లా ప్రజా జీవనాన్ని ప్రభావితం చేస్తున్న కీలకమైన ఈ రైల్వే సంబంధిత సమస్యలపై దృష్టి సారించి.., త్వరితగతిన పరిష్కారానికి సహకరిస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలకు హామీ ఇచ్చారు.