
పెట్టుబడులకు స్వర్గథామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్ -2025 విజయవంతంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.., ఒక్క సదస్సుతో లక్షల కోట్ల పెట్టుబడుల ప్రవాహం ఏపీకి వరదలా ప్రవహించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పెద్దఎత్తున శ్రమించారని వివరించారు. అంతేకాక మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా కంపెనీలను ఒప్పించడం ప్రశంసనీయమన్నారు. ఈ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రంలో దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక చరిత్ర అని కొనియాడారు. మిగతా రాష్ట్రలతో పొల్చుకుంటే.., ఏపీలో స్సీడ్ ఆఫ్ డూయింగ్ అనే నినాదంతో బిజినెస్ విధి,విధానాలను అనుసరించడంతో పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టాయన్నారు. అన్ని కీలక శాఖలతో ఒప్పందాలు ఒకేసారి కుదరడమే పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం గెలుచుకుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు మూడు ప్రాంతాలలోని ప్రతి జిల్లాకు ప్రాధాన్యత లభించడం గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.